CM Atishi | ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సీఎంగా అతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ప్రతిపాదనకు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. రాజీనామా చేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించిన అనంతరం సీఎం రేసులో ఎక్కువగా అతిషి పేరు వినిపించింది. ఊహించినట్లుగానే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అతిషి వైపే మొగ్గు చూపారు. అతిషి పంజాబీ కుటుంబానికి చెందిన వారు. ప్రాథమిక విద్య ఢిల్లీలోనే పూర్తి చేసింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఏడుగురు సీఎంలుగా పని చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు సీఎం పీఠాన్ని అధిష్టించారు.
ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కావడం విశేషం. మూడో మహిళా సీఎంగా నిలిచారు. ఇంతకు ముందు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పని చేశారు. షీలా దీక్షిత్ ఎక్కువ కాలం సీఎంగా పని చేశారు. బీజేపీ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ 12 నుంచి.. అదే సంవత్సరం డిసెంబర్ 3 వరకు అంటే దాదాపు 52 రోజుల పాటు సీఎంగా పని చేశారు. షీలా దీక్షిత్ 1992 డిసెంబర్ 3 నుంచి 2023 డిసెంబర్ 28 వరకు 15 సంవత్సరాల 25 రోజుల పాటు సీఎంగా సేవలందించారు. ఇక అతిషి కొత్తగా సీఎంగా నియామకమయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై కేజ్రీవాల్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే, అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, దస్త్రాలపై సంతకాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు పలు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే అతిషి ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అతిషి గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి తనదైన ముద్రవేశారు. ఆ పార్టీ ప్రభుత్వంలో విద్యారంగం అగ్రస్థానానికి ప్రముఖ స్థానం ఉన్నది. విద్యారంగం సాధించిన విజయాల్లో క్రెడిట్ అతిషికే దక్కుతుంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను రూపొందించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ఆప్ అధికార ప్రతినిధిగా నియమించారు. 2019లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో 4.77లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 2023లో తొలిసారిగా కేజ్రీవాల్ సర్కారులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విద్యాశాఖ మంత్రిగా పని చేసిన మనీష్ సిసోడియాకు ఆమె ఎంతగానే సహకారం అందించారు. ఆయనకు సలహాదారుగా ఉంటూ పలు వ్యూహాలను రూపొందించారు. 20058లో ఆమెను ఆ పోస్టును తొలగించారు. ఆప్ పార్టీలో ఆమె కీలక నాయకురాలు. ఆమె గతంలో ఉపాధ్యాయురాలిగా సేవలందించిన ఆమె.. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుచడంలో ముఖ్య భూమిక పోషించారు. అలాగే, ఆమె ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2020లో అతిషి మొదటిసారిగా కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 11,393 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధరమ్వీర్ సింగ్‌పై విజయం సాధించారు.
అతిషి 8 జూన్ 1981న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్, త్రిప్తా వాహీ దంపతులకు జన్మించారు. అతిషి తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని స్ప్రింగ్‌డేల్ పాఠశాలలో పూర్తి చేసింది. అతిషి సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చదివారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చెవెనింగ్ స్కాలర్‌షిప్‌పై మాస్టర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ నుంచి ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌లో రోడ్స్ స్కాలర్ లభించింది. అతిషి మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఏడు సంవత్సరాలు గడిపారు. అక్కడ ఆమె సేంద్రీయ వ్యవసాయం, ప్రగతిశీల విద్యా వ్యవస్థపై.. లాభాపేక్ష లేని సంస్థలతో కూడా పని చేసింది. అక్కడ ఆమె తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలను కలిశారు. అతిషి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఆమె పార్టీతో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు.