Delhi High Court : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఉన్నావ్ (Unnav) ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్న సస్పెండెడ్ బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సెంగర్ (Kuldeep Singh Sengar) శిక్షను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిలిపివేసింది. ఈ మేరకు మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. కుల్దీప్ సింగ్ సెంగర్ శిక్షను నిలిపివేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నది.
ఉన్నావ్ అత్యాచార కేసులో సెంగర్‌ను దోషిగా నిర్ధారిస్తూ 2019లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అతను దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో.. శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం సెంగర్‌ను బెయిల్‌పై విడుదల చేసింది. అందుకుగానూ రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
నిందితుడు బాధితురాలి ఇంటి పరిధిలోకి వెళ్లకూడదని, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ బెదిరింపులకు పాల్పడగూడదని కోర్టు ఆర్డర్ వేసింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విచారణలో అతడు దోషిగా తేలితే పూర్తి శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా 2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు.
2019 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. అనంతరం బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులోనూ సెంగర్ దోషిగా తేలడంతో పలు కేసుల్లో అతడికి జీవిత ఖైదు విధించారు.