న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త సోలార్ పాలసీ(Solar Policy)ని ప్రకటించారు. సౌర విద్యుత్తు 2024కు చెందిన విధివిధానాలను ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 2016కు చెందిన సోలార్ పాలసీ అమలులో ఉందన్నారు. దేశంలోనే ఆ విధానం అత్యంత క్రియాశీలకమైందన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నారు. 400 యూనిట్లు ఖర్చు చేసిన వారికి సగం ఛార్జీలు వసూల్ చేస్తున్నామన్నారు. ఇక 400 యూనిట్లు దాటిన వారి వద్ద నుంచి మొత్తం బిల్లును వసూల్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే కొత్త సోలార్ విధానంలో .. తమ ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఫిక్స్ చేసినవాళ్లకు అసలు కరెంటు బిల్లు ఉండదన్నారు. సోలార్ విద్యుత్తు ఫలకాలను ఇంటిపై అమర్చుకున్నవాళ్లు ఎంత విద్యుత్తును ఖర్చు చేసినా వాళ్లకు ఏమాత్రం బిల్లు ఉండబోదన్నారు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వాళ్లు ప్రతి నెలా సుమారు 900 సంపాదించవచ్చు అని కూడా సీఎం కేజ్రీవాల్ తెలిపారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్‌లపై మూడేళ్లలోగా సోలార్ ప్యానెళ్లను పెట్టనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. సోలార్ పాలసీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం దక్కిందని, పది రోజుల్లోగా నోటిఫికేషన్ వస్తుందన్నారు.