Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ కారులో బాంబు పేలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 24 మంది వరకు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సంఘటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్స్ విభాగం బృందాలు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించి హోంమంత్రి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్‌తో నిరంతరం సంప్రదిస్తున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్-1 సమీపంలో జరిగిన పేలుడు తర్వాత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం సమీక్షించారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితిపై తాజా సమాచారం అందుకున్నారు. పేలుడు తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేశారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుమట్టారు. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. రాత్రి 7.29 గంటల నాటికి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటోరిక్షా మంటల్లో కాలిపోయినట్లుగా ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. ఢిల్లీలో పేలుడుకు ఐఈడీని ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే, దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉండగా.. సోమవారం జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైష్ ఏ మొహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధం ఉన్న ఓ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు కీలక అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం సుకున్నారు. అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని బున్పోరా, నౌగామ్‌లో పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తూ జైష్ ఏ మహ్మద్ పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌లో పలువురు ప్రొఫెషనల్స్ ఉన్నారని.. విదేశీయ పరిచయాల ద్వారా పని చేస్తున్నట్లుగా తేలింది. సామాజిక, స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిధులను సేకరించినట్లుగా గుర్తించారు. నిందితులు ఉగ్రవాదుల కోసం వ్యక్తులను గుర్తించడం, వారిని సమూలంగా మార్చడం, ఆయుధాలు, ఐఈడీ తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించేందుకు పని చేశారు. ఇందులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు ఉండడం గమనార్హం.
ఆరిఫ్ నిసార్ దార్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్ షాహిద్, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్, జమీర్ అహ్మద్ అహంగర్ ముత్లాషా, డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై ముసైబ్. డాక్టర్ ఆదిల్‌ను అరెస్టు చేశారు. పోలీసులు శ్రీనగర్, అనంత్‌నాగ్, గందర్బాల్, షోపియాన్, ఫరీదాబాద్, సహరాన్‌పూర్‌లో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో అల్ ఫలాహ్ వర్సిటీ వద్ద డాక్టర్ ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఫరీదాబాద్‌లో దాదాపుగా 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండో డాక్టర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఫరీదాబాద్‌లో ఆయుధాలను గుర్తించారు. అయితే, వారం వ్యవధిలో నాలుగు రాష్ట్రాల్లో అరెస్టు చేసిన వ్యక్తులు నలుగురు డాక్టర్లు ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అరెస్టు చేసిన వారి నుంచి దాదాపుగా 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, విషపదార్థాలు పోలీసులు స్వాధీం చేసుకున్నారు. సోమవారం ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న తరుణంలోనే పలువురి అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో పేలుడు జరుగడం కలకలం సృష్టిస్తున్నది. ఢిల్లీ ఘటన, ఈ అరెస్ట్ అయిన వారికి ఏమైనా లింక్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.