Delhi Blast | ఢిల్లీ బాంబు పేళ్లలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగు చోట్ల వరుస దాడులు జరుపాలని దాదాపు ఎనిమిది మంది ప్లాన్ చేశారు. వారంతా రెండుగ్రూపులుగా ఏర్పడి నాలుగు ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రతి గ్రూప్ మల్టిపుల్ ఐడీలను వెంట తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రకోట బ్లాస్ట్‌లో నిందితులైన డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్, ఉమర్, షాహిన్ కలిసి సుమారు రూ.20లక్షలు సేకరించారని.. ఆ సొమ్మంతా ఉమర్‌కు అప్పగించినట్లుగా తేలింది. ఆ తర్వాత ఐఈడీని తయారు చేసేందుకు గురుగ్రామ్, నుహ్, పరిసర ప్రాంతాల నుంచి రూ.3లక్షల విలువైన 20 క్వింటాళ్ల ఎన్పీకే (Nitrogen, Phosphorus, Potassium) ఫెస్టిసైడ్స్ కొనుగోలు చేశాడు.
అయితే, ఉమర్, డాక్టర్ ముజమ్మిల్ మధ్య ఆర్థిక వివాదం ఉంది. ఉమర్ సిగ్నల్ యాప్‌లో ఇద్దరు, నలుగురితో సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం అయిన డిసెంబర్ 6న ఢిల్లీలో 2008 ముంబయి దాడుల మాదిరిగానే 26/11 దాడికి డాక్టర్ ఉమర్ ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలింది. అందుకే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లుగా తేల్చారు. ఫరీదాబాద్‌కు చెందిన వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్లో భాగంగా అరెస్టు చేసిన ఎనిమిది మందిని విచారించిన సమయంలో ఈ కుట్ర కోణం వెలుగు చూసింది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం లక్ష్యంగా చేసుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
అలాగే, దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, షాపింగ్స్ మాల్స్‌లో దాడులకు ప్రణాళిక రూపొందించారు. ఫరీదాబాద్‌లో అరెస్టయిన వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యుడు డాక్టర్ ముజమ్మిల్ గనై ఈ ఏడాది జనవరిలో ఎర్రకోట ప్రాంతంలో పలుసార్లు రెక్కీ నిర్వహించినట్లుగా మొబైల్ ఫోన్ డేటా ద్వారా తెలిసింది. జనవరి 26న లక్ష్యంగా చేసుకున్న కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగినట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అయితే, ఈ దాడి కుట్రను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ముజమ్మిల్, ఉమర్ టర్కిష్ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి తొలివారంలో ఎర్రకోట ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలోనే ముజమ్మిల్ ఉన్నట్లుగా మొబైల్ ఫోన్ డేటా వెల్లడించిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
భద్రతా ఏర్పాట్లు, అక్కడికి వస్తున్న జనాలను అంచనా వేసేందుకు ముజమ్మిల్, ఒమర్ పలుసార్లు సంఘటనా స్థలానికి వెళ్లారు. టవర్ లొకేషన్ డేటా, సమీప ప్రాంతాల నుంచి సేకరించిన సీసీటీవ ఫుటేజ్ ద్వారా నిర్దారించారు. ఒమర్, ముజమ్మిల్ తుర్కియేకి వెళ్లినట్లుగా దర్యాప్తు సంస్థలకు సమాచారం. పాస్‌పోర్టుల్లో తుర్కియే ఇమ్మిగ్రేషన్ స్టాంప్‌లు గుర్తించారు. వారిద్దరూ అక్కడ ఎవరైనా విదేశీ హ్యాండ్లర్స్‌ను కలిశారా? లేదా ? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మాడ్యూల్‌కు నిధులు, ముజమ్మిల్ కమ్యూనికేషన్స్‌ను విశ్లేషిస్తున్నారు. మరో వైపు తుర్కియే ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాల్లో తమకు ఎలాంటి ప్రమేయాన్ని తోసిపుచ్చింది. మీడియాలో వచ్చిన వార్తలు సత్యదూరమని పేర్కొంది.