Delhi blast : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలోని దుకాణసముదాయాల నడుమ I20 కారు (I20 car) లో జరిగిన ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల 22 దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. అక్కడికక్కడే 8 మంది మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారు.
చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఈ భయానక పేలుడు ఘటన గురించి స్థానిక దుకాణదారుడు మీడియాకు చెప్పాడు. అంత భారీ శబ్దాన్ని తాను తన జీవితంలో ఎన్నడూ వినలేదన్నాడు. ఆ పేలుడు ధాటికి తాను ఏకంగా మూడు సార్లు కిందపడి లేచానని చెప్పాడు. కొన్ని క్షణాల్లో అందరం చావబోతున్నామని తనకు అనిపించిందని తెలిపాడు.
కాగా ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల కుట్ర దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమర్ అహ్మద్ అనే వ్యక్తి కారులో పేలుడు పదార్థాలు తీసుకొచ్చి ఆత్మహుతికి పాల్పడి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఉమర్ అహ్మద్‌కు జైష్ ఏ మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.