Umar Mohammad : ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో దర్యాప్తు సాగుతున్నా కొద్ది వెన్నులో వణుకు పుట్టించే కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మాహుతి బాంబర్ ఉమర్ మొహమ్మద్ (Umar Mohammad) తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు బుర్హాన్ వానీ, జకీర్ మూసాకు వారసుడిగా భావించేవాడని తేలింది. అతడు 2023 నుంచే ఐఈడీల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు వెల్లడైంది.
అతడు పేలుడు పదార్థాలతో చాలా ప్రయోగాలు చేసేవాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దాడుల విషయంలో మిగిలిన వారితో అభిప్రాయభేదాలు రావడంతో మరో ఉగ్రవాది ఆదిల్ రాథర్ పెళ్లికి ఉమర్ హాజరుకానట్లు గుర్తించారు. కశ్మీర్లో ముఫ్తీ ఇర్ఫాన్ అరెస్టు విషయం తెలియగానే అక్టోబర్ 18న హడావుడిగా ఖాజీగుండకు వెళ్లి మిగిలిన తమ గ్రూప్‌లోని సభ్యులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో పాత్ర ఉన్న ముజమ్మిల్, ఆదిల్, ముఫ్తీ ఇర్ఫాన్‌లు అల్‌ఖైదా భావజాలంతో పనిచేస్తుంటే.. ఉమర్ మాత్రం ఐసిస్ తరహాలో పని చేయాలని భావించేవాడు. ఈ బృందంలో కొందరు అఫ్గానిస్థాన్‌కు కూడా వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఈ గ్రూపులో ఉమర్ లెక్కలేకుండా నిధులు ఖర్చుపెట్టడంపై అభిప్రాయభేదాలున్నాయి. ఈ నిధుల్లో అత్యధిక భాగం మహిళా సభ్యురాలైన డాక్టర్ షాహీన్ నుంచి లభించాయి.