న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బైక్ ట్యాక్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ కమిషనర్ అశీశ్ కుంద్రా ఒక ప్రకటన చేశారు. ర్యాపిడో, ఉబెర్ లాంటి బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే.. అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.
ర్యాపిడో, ఉబెర్ లాంటి బైక్ ట్యాక్సీలు 1988 నాటి ఢిల్లీ రవాణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ప్రభుత్వం ఆ రెండు ట్యాక్సీ కంపెనీలపై నిషేధం విధించింది. దాంతో ఆ కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ర్యాపిడో, ఉబెర్ ట్యాక్సీ కంపెనీలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.