ఓటు కోల్పోతే దేశ బహిష్కరణ!
ముంబైలోని తన ఇంటి నుంచి కూరగాయలు కొనేందుకు జూలై 19న షాహిదా ఫకీర్ తన చిన్న కుమారుడితో కలసి బయటకు వచ్చింది.
- ముస్లింలలో పెరుగుతున్న పౌరసత్వ భయం
- బెంగాలీ ముస్లింలే లక్ష్యంగా ఓట్ల తొలగింపు
న్యూఢిల్లీ, నవంబర్ 16: ముంబైలోని తన ఇంటి నుంచి కూరగాయలు కొనేందుకు జూలై 19న షాహిదా ఫకీర్ తన చిన్న కుమారుడితో కలసి బయటకు వచ్చింది. సివిల్ డ్రెస్సులో ఉన్న అధికారులు తనను అదుపులోకి తీసుకొని తన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, అందులో గుర్తింపు పత్రాల కాపీలు ఉన్నాయని ఆమె చెప్పింది. చివరికి వారు తనను బలవంతంగా సరిహద్దు దాటించారని ఆమె చెప్పింది. ఆ అధికారులు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు చెందినవారని కోర్టులో దాఖలు చేసిన పత్రాలు చూపుతున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఎవరో వెనుక నుంచి నా చేయి పట్టుకొని, వాహనంలోకి ఎక్కమని ఆదేశించారు అని బంగ్లాదేశ్‌లోని సత్ఖరాలో షాహిదా ఫకీర్ రాయిటర్స్‌కు చెప్పింది. మూడు నెలలకు పైగా ఆమె తన భర్తకు, ఇద్దరు కుమారులకు దూరంగా బంగ్లాదేశ్‌లోని ఒక గ్రామంలో నివసిస్తున్నది. దేశంలో సవరించిన ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైన తర్వాత నిర్బంధానికి గురై, దేశం నుంచి బహిష్కరణకు లేదా పౌరసత్వం గురించి ప్రశ్నలు ఎదుర్కొన్న 10 కుటుంబాలలో ఫకీర్ ఒకరు.
వారందరి వద్ద భారతీయ గుర్తింపు లేదా కుటుంబ పత్రాలు ఉండగా, తల్లిదండ్రులు, తోబుట్టువులతో సహా బంధువులు అందరూ ఓటర్ల జాబితాలో కొనసాగారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించినంత మాత్రాన ఒక వ్యక్తి విదేశీయుడని రుజువు కానప్పటికీ భారత్ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) అనుమానిత అక్రమ వలసదారులను గుర్తించి, బహిష్కరించే మరో కార్యక్రమంతో ఎలా పెనవేసుకుపోయిందో ఈ కేసులు చూపిస్తున్నాయి.
ముస్లింలపై తీవ్ర ప్రభావం
దేశ చరిత్రలోనే అతిపెద్ద ఓటర్ల తొలగింపుగా నిలిచిన సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారు. సర్ ప్రక్రియ దేశంలో భారీ నిరసనలకు దారితీయగా ఓటర్లను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకొంటున్నదనే ఆరోపణలకు ఇది దారితీసింది. అయితే అర్హులైన, చట్టబద్ధంగా దేశంలో నివసిస్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణలను బీజేపీ ఖండించింది.
సర్ ప్రక్రియ అత్యంత విస్తృతంగా జరిగిన పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాష్ట్ర ఎన్నికలకు ముందు సుమారు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. కోల్‌కతాకు చెందిన ;సబార్ ఇన్స్టిట్యూట్’ అందించిన సమాచారం ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తొలగించిన 27 లక్షల మంది పేర్లలో 70 శాతం మంది ముస్లింలే ఉన్నారు. వాస్తవానికి రాష్ట్ర జనాభాలో ముస్లింల వాటా 27 శాతం మాత్రమే. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మొదటిసారిగా రాష్ట్రంపై పట్టు సాధించింది.
నవంబర్ 5న ఉత్తర భారతంలోని హర్యానాలో జరిగిన ఒక ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. చొరబాటుదారులను గుర్తించి, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, ఆ తర్వాత వారిని ఒక్కొక్కరిగా ఏరివేసి దేశం నుంచి పంపించివేయాలనేది బీజేపీ సంకల్పం అని ఆయన ప్రకటించారు.
బెంగాల్ ముస్లింలే టార్గెట్
అణచివేత చర్యలకు పశ్చిమ బెంగాల్ ఒక ప్రధాన కేంద్రబిందువుగా మారింది. 1947లో భారతదేశ విభజన సమయంలో బ్రిటిష్ వారు గీసిన సరిహద్దు ఈ ప్రాంతాన్ని రెండుగా విభజించింది. ఆ కల్లోల సమయంలో, అలాగే 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధం జరిగినప్పుడు లక్షలాది మంది సరిహద్దు దాటారు. దీనివల్ల కుటుంబాలు, సమాజాలు సరిహద్దుకు ఇరువైపులా ఉండిపోయాయి.
న్యాయ పోరాటాలు చేస్తున్న బాధితులు
సరిహద్దులో ఎటువంటి కాపలా లేదా కంచె లేని ఒక ప్రాంతం గుండా తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో తనను బంగ్లాదేశ్‌లోకి నెట్టేశారని ఫకీర్ చెప్పింది. శరీరమంతా బురదతో ఉన్న ఆమె గంటల తరబడి నడచిన తర్వాత ఏడుస్తున్న ఆమెను చూసి ఒక రైతు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను అస్సాం సరిహద్దులో సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్ఎఫ్), తదనంతరం నియమిత అధికారుల ద్వారా బంగ్లాదేశ్‌కు బహిష్కరించినట్టు ముంబై పోలీసులు కోర్టుకు తెలిపారు.
దీనిపై బంగ్లాదేశ్ సరిహద్దు దళం, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి ఎటువంటి స్పందన లేదు. నన్ను బంగ్లాదేశ్‌కు పంపివేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు అని ఫకీర్ తెలిపింది. నా ఇల్లు, నా తాతాబామ్మలు, నా కుటుంబం అంతా భారత్‌లోనే వేళ్లూనుకొని ఉన్నాయి అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆమె భర్త జుమ్మన్ పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి దాఖలైన లక్షలాది అభ్యంతరాలతోపాటు ఆమె తరఫున కూడా కోర్టులో వాదిస్తున్నారు.
ఆగస్టులో సుప్రీంకోర్టులో ఆమె కుటుంబం దాఖలు చేసిన పిటిషన్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ద్వారా పౌరసత్వాన్ని నిర్ధారించలేదని వాదించింది. అదనపు పత్రాలు సమర్పించకుండా ఎవరు కొనసాగవచ్చో నిర్ధారించడానికి తాజా సర్‌లో ఒక ప్రమాణంగా ఉన్న 2002-03 ఓటర్ల జాబితాలో కూడా వారి పేర్లు ఉన్నాయి. ఫకీర్ 2008 నుంచే పశ్చిమ బెంగాల్ ఎన్నికల జాబితాలో ఉన్నారు.అయితే ఫకీర్తో సహా మొత్తం 149 మందినా ఆ ఆపరేషన్ సమయంలో దేశం నుంచి బహిష్కరించారు. వీరంతా బంగ్లాదేశ్ పౌరులని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

