బీజింగ్ : సామాజిక మాధ్యమాల్లో వీడియోలు (Reels) చేసేవారికి తప్పనిసరిగా తగిన విద్యార్హతలు ఉండాలని చైనా ప్రభుత్వం (China) ప్రకటించింది. వైద్య, న్యాయ, విద్య, ఆర్థిక తదితర సున్నితమైన అంశాలపై వీడియోలు చేసేవారు మూడు నిబంధనలను పాటించాలని తెలిపింది. వాటిలో మొదటిది, రెండు నెలల్లోగా సర్టిఫికెట్, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ క్రెడెన్షియల్స్‌ను సమర్పించాలి. రెండోది, తాము అందిస్తున్న సమాచారం కచ్చితంగా సరైనదేనని రుజువు చేయాలి.
మూడోది, ఆ సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? అది ఏఐ లేదా డ్రమటైజేషన్ ద్వారా సృష్టించారా? తెలియజేయాలి. డౌయిన్ (చైనా టిక్ టాక్), బిలిబిలి, వీబో వంటి వేదికలు తప్పనిసరిగా ఈ క్రియేటర్ల డిగ్రీలు, సర్టిఫికెట్లు సరైనవేనా? మోసపూరితమైనవా? అనే అంశాలను తనిఖీ చేయాలి. ఈ నిబంధనలను పాటించని క్రియేటర్ల ఖాతాలను సస్పెండ్ లేదా డిలీట్ చేస్తారు, రూ.12 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఫేక్ కంటెంట్ నుంచి ప్రజలను కాపాడటం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా ప్రభుత్వం తెలిపింది.