బెంగళూరు: రైల్వే స్టేషన్‌లోని డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఈ సంఘటన కలకలం రేపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 1పై ఉన్న డ్రమ్ నుంచి దుర్వాసన రావడాన్ని క్లీనింగ్ సిబ్బంది గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బట్టలతో కప్పి మూత వేసి ఉన్న ఆ డ్రమ్‌ను పోలీసులు పరిశీలించారు. కుళ్లినస్థితిలో ఉన్న మహిళ మృతదేహాం అందులో ఉండటం చూసి షాకయ్యారు.
కాగా, మృతురాలి వయసు 20 ఏళ్లు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిఫుణులను అక్కడకు రప్పించి ఆధారాలు సేకరించారు. మృతురాలు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని నైరుతి రైల్వే అదనపు డివిజనల్ మేనేజర్ కుసుమ హరిప్రసాద్ తెలిపారు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 1పై ఉన్న డ్రమ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని క్లీనింగ్ సిబ్బంది గుర్తించినట్లు చెప్పారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటన యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్లో కలకలం రేపింది.