బెంగళూరు, జూలై 30: చచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం.. అనేది సామెత. అయితే చనిపోయిన వారికి పెండ్లి చేస్తారా..? కట్నం కూడా ఇస్తారా..? అనే కదా ఇప్పటివరకు మనకున్న అనుమానం. అయితే అలాంటి పెండ్లి కూడా జరిగిందండోయ్.. చనిపోయిన వారికి పెండ్లి జరగడమేంటి.. నిజంగా అలా కూడా ఉంటుందా అనుకోకండి. ఎందుకంటే కర్ణాటకలో అలాంటి పెండ్లే ఇటీవల జరిగింది. పైగా ఇది చాలా ప్రత్యేకంగా జరిగింది. అదే ప్రేత కల్యాణం. అంటే చనిపోయిన వారికి పెండ్లి చేయటం. ఇదేదో సాదాసీదా పెండ్లి ఏమీకాదు. బతికున్నవారికి ఎంత సంప్రదాయబద్ధంగా పెండ్లి చేస్తారో ఈ ప్రేత కల్యాణం కూడా అచ్చం అలాగే చేస్తారు. ఈ ప్రేత కల్యాణాలు దక్షిణ కర్ణాటక, కేరళలో ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నాయి.
ఆత్మల శాంతికోసం
ఇటీవల దక్షిణ కన్నడ జిల్లాలో ఓ కుటుంబం 30 ఏండ్ల క్రితం చనిపోయిన వారికి కల్యాణం నిర్వహించింది. సాధారణ పెండ్లి మాదిరిగానే బంధుమిత్రులందరినీ పిలిచారు. వరుడు, వధువు వైపు కుటుంబాలు సందడిగా మారిపోయాయి. ఎంగేజ్మెంట్ నుంచి పెండ్లి ముహూర్తం, ఎదుర్కోళ్లు, సప్తపది, బాజా బజంత్రీలు.. ఇలా దేనికీ లోటు లేకుండా అంగరంగ వైభవంగా పెండ్లి నిర్వహించారు. ఒక్కటే తేడా సాధారణ పెండ్లిలో వధువు, వరుడు ఉంటారు.. ప్రేతకల్యాణంలో వారి ప్రతిమలు ఉంటాయి. ఈ పెండ్లికి హాజరైన యూట్యూబర్ అన్నే అరుణ్ దాని గురించి సంపూర్ణ సమాచారంతో ట్వీట్లు చేయటంతో ఈ పెండ్లి వైరల్గా మారింది. పురిట్లో చనిపోయిన వారి ఆత్మల శాంతికోసమే ప్రేత కల్యాణం నిర్వహించే సంప్రదాయం మొదలైందని పెండ్లింటివారు చెప్తున్నారు.