న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్వేలో ఉన్న చార్లెస్ యూనివర్సిటీలో కాల్పులు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 14 మంది మరణించగా, 25 మంది గాయపడ్డారు. వర్సిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో షూటింగ్ జరిగింది. కాల్పులకు తెగించిన వ్యక్తి 24 ఏళ్ల విద్యార్థి డేవిడ్ కోజాక్గా గుర్తించారు. ప్రాగ్వేకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో అతను నివసిస్తున్నాడు. వర్సిటీలో అతను పోలాండ్ హిస్టరీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతనో ఎక్స్లెంట్ స్టూడెంట్ అని ప్రాగ్వే పోలీసు చీఫ్ మార్టిన్ వొండ్రాసెక్ తెలిపారు.
కోజాక్ చాలా తుపాకులను లీగల్‌గా సొంతం చేసుకున్నాడు. కాల్పుల ఘటన సమయంలో అతని వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా చాకచక్యంగా అతను ప్లాన్ చేసి షూటింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రాగ్వేకు సమీపంలో ఉన్న హూస్టన్ పట్టణంలో అతని తండ్రి నివసిస్తున్నాడు. వర్సిటీ కాల్పుల ఘటనకు ముందు అతను తన తండ్రిని కూడా షూట్ చేశాడని పోలీసులు చెబుతున్నారు.
డేవిడ్ కోజాక్ మృతదేహాన్ని వర్సిటీలో గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా షూట్ చేశారా అన్న విషయం తెలియదని పోలీసులు వెల్లడించారు. వర్సిటీ దాడికి ముందు డేవిడ్ కోజాక్ టెలిగ్రాం యాప్‌లో భయానక మెసేజ్ చేశాడు. స్కూల్ షూటింగ్‌కు పాల్పడాలని ఉందని ఆ మెసేజ్‌లో తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. కాల్పులు జరిపి ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలని ఉందని అతను ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. హత్య చేయాలని ఉందని, భవిష్యత్తులో పిచ్చివాడినయ్యే అవకాశాలు ఉన్నట్లు రాసుకున్నాడు.
కాల్పుల్లో మృతిచెందిన బాధితుల సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఎందు కోసం అటాక్ జరిగిందన్న అంశాన్ని కూడా తేల్చలేదు. తీవ్రవాద ఐడియాలజీ కానీ, గ్రూపులతో కానీ లింకులు ఉన్నట్లు అనుమానాలు లేవని ఆ దేశ హోంమంత్రి విట్ రాకుసన్ తెలిపారు.