Dana Cyclone : దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తున్నది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దానా’ తుఫాన్.. రేపటికి వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం గంటకు 15 కిలో మీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్.. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని, పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తుఫాన్ తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది.
ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా) కి 520 కిలో మీటర్లు.. సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిలో మీటర్లు, ఖేపుపరా (బంగ్లాదేశ్) కు 610 కిలో మీటర్ల దూరంలో దానా తుఫాన్ కొనసాగుతోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంట బుధవారం మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రేపు రాత్రి నుంచి 100-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇదిలావుంటే విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రానికి చెందిన వాతావరణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కొనసాగుతుందని చెప్పారు. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారుతుందన్నారు. ఈ నెల 25న ఉదయం పూరీ-సాగర్ ఐలాండ్స్ మధ్య భితార్కానికా, ధమ్రా సమీపంలో తీరం దాటే ఆవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.