అయోధ్య: అయోధ్యలో దళిత యువతి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులు, అనంతరం కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఫైజాబాద్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ నేత అవధేష్ ప్రసాద్ బోరున విలపించారు. ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆ యువతి కుటుంబానికి న్యాయం జరగకపోతే తాను తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె గురువారం రాత్రి భాగవత కథ వినడానికి వెళ్లారు. ఆ మర్నాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. వివస్త్రగా ఉన్న ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయి. ఎముకలు విరిగిపోయాయి. ఆమె శరీరాన్ని తాళ్లతో కట్టేశారు. కళ్లు పీకేశారు. ఆమె కనిపించకుండాపోయినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ తివారీ చెప్పారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.