న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆర్థిక మోసాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. సున్నితమైన సమాచారాన్ని లాగేసుకొని, కార్డుదారుల సొమ్మును కాజేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఓటీపీ, సీవీవీ, క్రెడిట్ కార్డు వివరాలను ఇతరులతో పంచుకోరాదంటూ హెచ్చరిస్తున్నారు. ప్రీ-అప్రూవ్డ్, ఇన్స్టంట్ పేర్లతో క్రెడిట్ కార్డు లిమిట్ ‘స్కామ్’ కొనసాగుతున్నట్టు నిపుణులు పేర్కొన్నారు.
క్రెడిట్ కార్డు వాడకందారులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల సైబర్ నేరగాళ్ల కండ్లు ఇప్పుడు వీటిపై పడ్డాయి. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఏదైనా సందేశం మన ఫోన్కు వచ్చిందంటే దానిని గుడ్డిగా నమ్మవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమాయకులైన కొంతమంది కార్డుదారులను బోల్తా కొట్టించటమే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి మేసేజ్లు, ఫోన్ కాల్స్, అనధికారిక ఈ-మెయిల్స్ వచ్చాయంటనే అనుమానించాలని చెబుతున్నారు.