భోపాల్: ఒక మహిళ రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడింది. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో డాక్టర్లు సీటీ స్కాన్ చేశారు. ఆమె కడుపులో కత్తెర ఉండటం చూసి షాక్ అయ్యారు. రెండేళ్ల కిందట ఆ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు పొరపాటున ఆ కత్తెరను ఆమె కడుపులో మరిచిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. (Scissors In Woman’s Stomach) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. సౌంధ గోహద్‌లో నివసించే 44 ఏళ్ల కమలా బాయికి రెండేళ్ల కిందట గ్వాలియర్‌లోని ప్రసిద్ధ కమల రాజా హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. నాటి నుంచి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది.
కాగా, శుక్రవారం ఆ మహిళకు సీటీ స్కాన్ చేశారు. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు గ్రహించి డాక్టర్లు షాక్ అయ్యారు. రెండేళ్ల కిందట ఆ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు పొరపాటున ఆ కత్తెరను ఆమె కడుపులో మరిచి కుట్టేసి ఉంటారని అనుమానించారు. సర్జరీ ద్వారా ఆ కత్తెరను తొలగించారు.
మరోవైపు నిర్లక్ష్యం వహించిన నాటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కుటుంబం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని జిల్లా ఆసుపత్రి అధికారులు తెలిపారు.