అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పిల్లల కోసం అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. దీన్ని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమోదిస్తే.. 2-18 ఏండ్ల వయసు పిల్లలకు త్వరలోనే ఈ టీకా అందుబాటులోకి రానుంది. 18 ఏండ్లలోపు పిల్లల కోసం ఇప్పటికే జైడస్ క్యాడిలా టీకాకు అనుమతి లభించింది. దీని తర్వాత రెండో టీకాగా కొవాగ్జిన్ నిలువనుంది. భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కొవాగ్జిన్ 2, 3వ దశ ట్రయల్స్ నిర్వహించి, ఆ డాటాను ఈ నెల మొదట్లో కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో)కు అందజేసింది. దాన్ని కరోనాపై నియమించిన నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇది కూడా రెండు డోసుల టీకాయే. మొదటి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు వేయాలి. కాగా, 12 నుంచి 18 ఏండ్లలోపు వారి కోసం జైకోవ్-డీ పేరిట టీకాను జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసింది. దీని అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇదివరకే అనుమతి ఇచ్చింది. అయితే ఆ టీకా పంపిణీని సంస్థ ఇంకా ప్రారంభించలేదు.
కార్బివాక్స్ బూస్టర్ డోస్ ట్రయల్స్‌కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌గా తాము అభివృద్ధి చేసిన ‘కార్బివాక్స్’ టీకా ఇవ్వడంపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన బయలాజికల్-ఈ సంస్థ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)ని కోరింది. ప్రస్తుతం 18-80 ఏండ్ల వయసువారిపై ఈ టీకా రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ నెలలోనే వాటి ఫలితాలు వెలువడుతాయి.