వారణాసి, అక్టోబర్ 25: జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్ మొత్తం ఏఎస్ఐ సర్వే చేయాలన్న హిందూ వర్గాల పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వొకేట్ విజయ్ శంకర్ రస్తోగీ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పురావస్తు పద్ధతులు, జీపీఆర్, జియో-రేడియాలజీ పద్ధతులను ఉపయోగించి ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా మొత్తం కాంప్లెక్స్‌లో సర్వే నిర్వహించాలని కోరారు. ప్లాట్ నెంబర్ 9130లో ఉన్న జ్ఞానవాపీ ప్రాంగణం పక్కన ఉన్న 9131, 9132 ప్లాట్లతో అనుసంధానమై ఉందని.. ఆ రెండు ప్లాట్లు భగవాన్ ఆది విశ్వేశ్వరుడికి చెందినవని రస్తోగీ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తన పిటిషన్ కొట్టేయడంపై ఆయన స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను పరిశీలించాక వాటి మీద జిల్లా కోర్టు లేదా అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తానన్నారు.
ముద్రా రుణ పరిమితి 20 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన(పీఎంఎంవై) కింద ఇస్తున్న ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. తరుణ్ విభాగంలో గతంలో రుణాలు తీసుకొని వాటిని సక్రమంగా చెల్లించిన వారికి కొత్తగా ఏర్పాటు చేసిన తరుణ్ ప్లస్ విభాగం కింద రూ.10 లక్షలు -20 లక్షల వరకు రుణాలు అందిస్తారు.