నోయిడా, జూన్ 17 : గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఓ ప్రేమ జంట మోటార్ సైకిల్‌పై ప్రమాదకరంగా రోమాన్స్ రైడ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను ఆ జంటకు రూ.55 వేల జరిమానా విధించారు. జూన్ 15న చిత్రీకరించబడిన 19 సెకన్ల క్లిప్‌లో, హాలీవుడ్ మూవీ స్టైల్లో ఒక యువతి బైక్ రైడింగ్ చేస్తున్న వ్యక్తికి ఎదురు కూర్చుని అతడిని బిగ్గరగా కౌగిలించుకుని ప్రయాణం కొనసాగించింది. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ ప్రేమ జంట ప్రమాదభరిత ప్రయాణాన్ని చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ స్టంట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహావేషాలు వ్యక్తం చేశారు. సదరు జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై గౌతమ్ బుద్ధనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) లఖన్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇద్దరికి జరిమానా విధించినట్లు తెలిపారు. వారికి రూ.55 వేల చలాన్ జారీ చేయబడిందన్నారు. ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చర్యలు చాలా ప్రమాదకరమైనవే కాకుండా కఠినమైన శిక్షలను ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు.