వారంలో టీకాలు

- 13లోగా వ్యాక్సిన్ మొదలు!
- సిద్ధమైన కేంద్ర ఆరోగ్యశాఖ
- తెలంగాణలో 1500 కేంద్రాలు
- కొ-విన్ పోర్టల్‌లో ఆరోగ్యకార్యకర్తలకు
- స్వీయ రిజిస్ట్రేషన్ అవసరం లేదు
- వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి
- కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడి
- రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా డ్రైరన్
- ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు
‘కొ-విన్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ విధానంలో టీకా సెషన్‌ను నిర్ణయిస్తుంది. వ్యక్తులకు టీకా వేసే కార్యక్రమం మొత్తం డిజిటల్ విధానంలో రికార్డవుతుంది. రెండో డోసుకు ఎప్పుడు రావాలో కూడా వెంటనే సమాచారం ఇస్తుంది. ఓ గుర్తింపు పత్రం కూడా వెంటనే జనరేట్ అవుతుంది. ఈ హెల్త్ ఐడీని మొబైల్ ఫోన్లో డీజీ లాకర్లో కూడా భద్రపర్చుకోవచ్చు. టీకా వేసేటప్పుడు ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చేందుకు కొ-విన్లో రియల్‌టైమ్ రిపోర్టింగ్ ఆప్షన్ కూడా ఉన్నది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి ముకుతాడు వేసే టీకాల కార్యక్రమం భారత్‌లో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నది. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ వేర్వేరుగా రూపొందించిన ‘కొవిషీల్డ్', ‘కొవాగ్జిన్' వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణవ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. వైద్యారోగ్యశాఖ సిబ్బందికే తొలివిడుత టీకాలు వేస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ/హైదరాబాద్,జనవరి 5 (నమస్తే తెలంగాణ): మరో వారంలో దేశంలో కరోనా టీకాలు వేయటం (వ్యాక్సినేషన్) ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్ ప్రకటించారు. గత ఆదివారం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించిన విషయాన్ని ఉదహరిస్తూ.. అనుమతి లభించిన నాటి నుంచి (జనవరి 3) పది రోజుల్లోగా ప్రజలకు సదరు టీకాలను వేయటం మొదలుపెడుతామని చెప్పారు. అయితే, ప్రభుత్వం దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్, హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను పలు పరిమితులతో అత్యవసరంగా వినియోగించేందుకు ఈ నెల 3న ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌పై మంగళవారం మీడియాతో మాట్లాడిన భూషణ్.. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రై రన్ సందర్భంగా రికార్డు చేసిన డాటాను సమీక్షించామని చెప్పారు.
వారికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు
టీకా కోసం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కొ-విన్ వెబ్‌పోర్టల్‌లో వ్యక్తిగతంగా వివరాలు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని రాజేశ్‌భూషణ్ తెలిపారు. వారందరి డాటా ప్రభుత్వం వద్ద ఉన్నదని.. దాని ఆధారంగానే టీకాలు వేస్తామని చెప్పారు. డ్రై రన్ డాటా ఆధారంగా పదిరోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు. కొ-విన్ వ్యవస్థను మనదేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఉపయోగపడేలా రూపొందించామని చెప్పారు. కొ-విన్ను వాడుకొనేందుకు ఏ దేశం ముందుకు వచ్చినా అందుకు భారత్ అన్నిరకాలుగా సహకరిస్తుందని తెలిపారు.
కొ-విన్ అంతా ఆటోమేటిక్
కరోనా టీకా కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా రూపొందించిన కొ-విన్ వ్యాక్సిన్ మేనేజ్మెంట్ సిస్టంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొత్తం ఆటోమేటిక్‌గా జరుగుతుందని రాజేశ్‌భూషణ్ తెలిపారు. ‘కొ-విన్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ విధానంలో టీకా సెషన్ (ఎక్కడ? ఎప్పుడు? టీకా వేస్తారన్న సమాచారం)ను నిర్ణయిస్తుంది. వ్యక్తులకు టీకా వేసే కార్యక్రమం మొత్తం డిజిటల్ విధానంలో రికార్డవుతుంది. రెండో డోసుకు ఎప్పుడు రావాలో కూడా వెంటనే సమాచారం ఇస్తుంది. ఓ గుర్తింపు పత్రం (హెల్త్ ఐడీ) కూడా వెంటనే జనరేట్ అవుతుంది. ఈ హెల్త్ ఐడీని మొబైల్ ఫోన్లో డిజి లాకర్లో కూడా భద్రపర్చుకోవచ్చు. టీకా వేసేటప్పుడు ఏమైనా సమస్య తలెత్తితే వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చేందుకు కొ-విన్లో రియల్‌టైమ్ రిపోర్టింగ్ ఆప్షన్ కూడా ఉన్నది. టీకాలు వేసేవారు.. వేయించుకొనేవారికి మార్గదర్శనం చేసేందుకు 12 భాషల్లో ఎస్ఎంఎస్లు పంపే సౌలభ్యం కూడా ఇందులో ఉన్నది. రెండు డోసులు వేసిన తర్వాత టీకా తీసుకున్నవారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా అందిస్తాం. దానిని డిజి లాకర్ ద్వారా కూడా నేరుగా పొందవచ్చు’ అని వివరించారు.
రెండు డోసులు వేసుకొంటేనే ప్రయోజనం
వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకొంటేనే శరీరంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. రెండో డోసు వేసుకున్న రెండు వారాల తర్వాత వైరస్ నుంచి పూర్తి రక్షణ కల్పించేలా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని మంగళవారం వెల్లడించారు. కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొనే టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సి వచ్చిందని ఐసీఎమ్మార్ డైరెక్టర్ బల్రామ్ భార్గవ తెలిపారు. మరోవైపు దేశంలో ఉత్పత్తి అయ్యే ఏ టీకా అయినా 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే నిల్వ చేసేలా ఉంటుందని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణుస్వరూప్ చెప్పారు. ఇదిలా ఉండగా కరోనా టీకాలను ఎగుమతి చేయకుండా ఏం సంస్థపైనా ప్రభుత్వం నిషేధం విధించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టంచేశారు.
రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైరన్
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుతలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మంగళవారం కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలు, వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, వ్యాక్సినేటర్ల తయారీ తదితర అంశాలపై సన్నద్ధమయ్యేందుకు గురు, శుక్ర వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏడు కేంద్రాల్లో నిర్వహించిన డ్రైరన్ విజయవంతమైందని తెలిపారు. ఈ క్రమంలో ఏర్పడ్డ సమస్యలకు పరిష్కారం చూపేందుకు జిల్లా, మండల స్థాయిలో ఏర్పడ్డ టాస్క్‌ఫోర్స్ కమిటీలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కొవిన్ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటివరకు సుమారు 2.90లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల సిబ్బంది నమోదు పూర్తయిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఎవరు కూడా వ్యాక్సిన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు లేవని చెప్పారు.
డ్రై రన్ డాటా ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. కొ-విన్ వ్యవస్థను మనదేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఉపయోగపడేలా రూపొందించాం. కొ-విన్ను వాడుకొనేందుకు ఏ దేశం ముందుకు వచ్చినా అందుకు భారత్ సహకరిస్తుంది.
-కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్
తాజావార్తలు
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు