న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరోనా కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ ఇండియాలోకి ప్రవేశించింది. ముంబైలో 50 ఏండ్ల మహిళకు ఎక్స్ఈ వేరియంట్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. ఈ మేరకు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) బుధవారం ప్రకటన విడుదల చేసింది. మరొకరికి కప్పా వేరియంట్ సోకినట్టు వెల్లడించింది. ఇద్దరిలోనూ ఎలాంటి తీవ్ర కొవిడ్ లక్షణాలు లేవని ఈ ప్రకటన పేర్కొన్నది. ముంబైలో ఎక్స్ఈ వేరియంట్ నిర్ధారణ అయిన మహిళ దక్షిణాఫ్రికా నివాసి. ఫిబ్రవరి 10న ఇండియాకు వచ్చారు. అయితే, ఈ ప్రకటనను ఇన్సాకాగ్ ఖండించింది. జన్యువిశ్లేషణలో ఎక్స్ఈ వేరియంట్ కనిపించలేదని పేర్కొన్నది. ముంబైలో సెరో సర్వేలో భాగంగా 376 మందికి నిర్వహించిన పరీక్షల్లో 230 మందికి కరోనా నిర్ధారణ కాగా అందుల్లో 228 మందికి ఒమిక్రాన్ సోకడం గమనార్హం.
యూకేలో మొదటిసారి గుర్తింపు
ఎక్స్ఈ వేరియంట్‌ను మొదటగా యూకేలో జనవరిలో గుర్తించారు. ఒమిక్రాన్‌లోని బీఏ.1, బీఏ.2 సబ్ వేరియంట్లు కలిసి ఇది ఏర్పడింది. అందుకే దీన్ని హైబ్రిడ్ వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. కరోనా వేరియంట్లు అన్నింట్లోకెల్లా ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాపించగలదని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల హెచ్చరించింది. ఇప్పటివరకు అత్యంత వేగవంతమైనది అని భావిస్తున్న ఒమిక్రాన్ బీఏ.2 కన్నా ఎక్స్ఈ 10% ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందని అంచనా వేసింది. ఈ వేరియంట్ ఇప్పటికే యూకే నుంచి న్యూజిలాండ్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు విస్తరించింది.
ఇప్పటికే బీఏ.2 బీభత్సం
ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా ఆగ్నేయాసియా, ఐరోపాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 బీభత్సం సృష్టిస్తున్నది. బీఏ.2 ధాటికి చైనాలో మొదటి రెండు వేవ్‌ల కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దక్షిణ కొరియాలో రోజువారీ కేసులు 6 లక్షల మార్కును దాటాయి. హాంకాంగ్, వియత్నాం, జర్మనీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. బీఏ.2 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా వేవ్ తప్పదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న సమయంలోనే అంతకంటే వేగవంతమైన ఎక్స్ఈ పుట్టుకురావడం ఆందోళనను మరింత పెంచుతున్నది.
మహమ్మారి ఇంకా ముగియలేదు
చాలా దేశాల్లో కరోనా కేసులు భారీగా తగ్గిపోవడంతో కొవిడ్ నిబంధనలను సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ జాగ్రత్త చెప్పింది. కరోనా మహమ్మారి ఇంకా పోలేదని హెచ్చరించింది. ఇంకా చాలా కాలం పాటు మానవాళి కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సి ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య, ఆర్థిక పరమైన నష్టం ఇంకా కొనసాగతుందని తన అధ్యయన నివేదికలో పేర్కొన్నది.
లక్షణాలు
జర్వం, గొంతు గరగర, గొంతుమంట, దగ్గు, జలుబు, దురద, అజీర్తి.
షాంఘైలో సామూహిక పరీక్షలు
కరోనా కోరల్లో చిక్కుకున్న చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో విస్తృతంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గత రెండుమూడు రోజుల కిందట జరిపిన పరీక్షల్లో 17,000లకుపైగా కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం సామూహిక పరీక్షలు (మాస్ టెస్టింగ్) నిర్వహించారు. ఓ అధికారి మాట్లాడుతూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నదని చెప్పారు. వైరస్‌ను కట్టడి చేయడానికి ఎన్ని చర్యలు చేపట్టినా చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నదన్నారు. వెలుగుచూస్తున్న కేసుల్లో ఎక్కువ మందికి లక్షణాలే ఉండటం లేదని, వైరస్ వ్యాప్తికి ఇది కారణంగా నిలుస్తున్నదని వెల్లడించారు.