న్యూఢిల్లీ, మార్చి 18: ఆగ్నేయాసియా, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. జ్వరం, శ్వాస సంబంధిత వ్యాధులతో దవాఖానకు వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది. వారికి తప్పక కరోనా టెస్టులు చేయాలని పేర్కొన్నది. పాజిటివ్‌గా వచ్చిన నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పంపాలని ఆదేశించింది. రాష్ర్టాల్లో టెస్టులను పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలు పాటించేలా ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని కోరారు. ఇండియాలో గురువారం 2,528 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 149 మంది చనిపోయారు. కాగా, శుక్రవారం దక్షిణ కొరియాలో 4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 301 మంది చనిపోయారు. ఇక్కడే గురువారం అత్యధికంగా 6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
కొత్త వేరియంట్లకు అవకాశం
అన్ని దేశాల్లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టులను పెంచాలని కోరింది. ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ వల్లే అనేక దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గిన కొద్దీ వైరస్ మళ్లీ వేగంగా విస్తరిస్తున్నదని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకురావడానికి అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పసిఫిక్ దీవుల్లోని అతిచిన్న దేశం సమోవాలో తొలి కేసు నమోదవ్వడంతో లాక్డౌన్ విధించారు.
జీరో కొవిడ్ పాలసీకే చైనా మొగ్గు
కరోనా కట్టడి కోసం ఇప్పటిదాకా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలకాలని చైనా భావిస్తున్నదని వచ్చిన వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. జీరో కొవిడ్ విధానానికే కట్టుబడి ఉంటామన్నది. లాక్డౌన్లతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతున్న నేపథ్యంలో చైనా కరోనా ఆంక్షలను సడలించాలని చూస్తున్నదని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన అన్ని ప్రయాణ ఆంక్షలను యూకే శుక్రవారం ఎత్తివేసింది.