DK Shivakumar | బిల్లులు చెల్లించేందుకు ఎవరైనా కమీషన్ డిమాండ్ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంట్రాక్టర్లకు సూచించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు కమీషన్లు పెద్ద ఇబ్బందిగా మారాయని కర్నాటక కాంట్రాక్టర్ల సంఘం (KSCA) ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం శివకుమార్, మరో ఇద్దరు సీనియర్ మంత్రుల కార్యాలయాల్లో అవినీతి మితిమీరిపోయిందని కాంట్రాక్టర్ల సంఘం గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. మంత్రుల కార్యాలయాల్లో బ్రోకర్లు కిక్కిరిసిపోయి ఉంటారని.. మైనర్ ఇరిగేషన్ మంత్రి ఎన్ఎస్ బోస్‌రాజు తనయుడు రవి బోస్‌రాజు లావాదేవీలన్నీ తానే జరుపుతారని, ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళి బంధువు ఒకరు శాఖాపరమైన వ్యవహారాల్లో తలదూరుస్తారని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఆరోపణలను శివకుమార్ ఖండించారు. తనతో పాటు మంత్రులపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ల నుంచి ఎవరైనా కమీషన్ అడిగి ఉంటే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలన్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎందుకు మంత్రిని అడగాలని ప్రశ్నించారు. వారికి (కాంటాక్టర్లకు) శాఖ బడ్జెట్ తెలియదా? గ్రాంట్ లేనప్పుడు వారు కాంట్రాక్టును ఎలా తీసుకున్నారు? అంటూ ప్రశ్నించారు. బీజేపీ హయాంలో తన శాఖ మాత్రమే రూ.లక్ష కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టులను ఇచ్చిందని.. ఈ కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించమని ఎమ్మెల్యేలు అడుగుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తాను కాంట్రాక్టర్లను హెచ్చరించానని ఆయన అన్నారు. నిధులు లేకుండా ఏ పని చేయవద్దని హెచ్చరించినా మాన వినలేదని.. ఇప్పుడు రాజకీయ నేతల వద్దకు వస్తున్నారన్నారు.