CJI Gavai | ముంబై, మే 18: ‘భారత ప్రధాన న్యాయమూర్తిని, పైగా ఈ ప్రాంత బిడ్డను. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని హితవు పలికారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ నెల 14న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
గోవా బార్ అసోసియేషన్ ఆదివారం ముంబైలో ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేసింది. దీనికి హాజరయ్యేందుకు జస్టిస్ గవాయ్ ముంబైకి వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం సీజేఐకి ఆహ్వానం పలికేందుకు మహారాష్ట్ర సీఎస్‌తోపాటు, డీజీపీగానీ, ముంబై పోలీస్ కమిషనర్‌గానీ హాజరుకాలేదు. దీంతో జస్టిస్ గవాయ్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
సన్మాన సభలో ప్రొటోకాల్ విషయంపై జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ‘నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎత్తిచూపాలని అనుకోవడం లేదు. కానీ ఇది ఒక వ్యవస్థ మరో వ్యవస్థ ఇచ్చే గౌరవానికి సంబంధించిన అంశం’ అని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యంలోని మూడు స్తంభాలు (శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ) సమానమే. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ఇతర వ్యవస్థల పట్ల పరస్పరం గౌరవం చూపాలి’ అని సూచించారు. ‘మహారాష్ట్ర బిడ్డ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసి, తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆహ్వానం పలికేందుకు సీఎస్, డీజీపీ లేదా ముంబై పోలీస్ కమిషనర్ రాకపోవడం సరైనదా? కాదా? అనేది వారికే వదిలేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ‘ఒక వ్యవస్థకు చెందిన అధిపతి తొలిసారి రాష్ర్టానికి వచ్చినప్పుడు ఇలా వ్యవహరించడం సబబేనా? అనేది వారే ఆలోచించుకోవాలి’ అని అసహనం వ్యక్తం చేశారు.
ఈ అంశంలో మరింత లోతుకు వెళ్లదలుచుకోలేదని, కానీ విషయం తెలియాలని చెప్తున్నానన్నారు. ఒకవేళ తన స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకునేవారని సున్నితంగా హెచ్చరించారు. ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టు ఏ అంశంలో అయినా, ఏ కేసులో అయినా సొంతంగా ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. అంతేకాదు.. ఏ వ్యక్తి అయినా కోర్టు మందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయగలదు. సీజేఐ వ్యాఖ్యలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సన్మానం అనంతరం జస్టిస్ గవాయి అంబేద్కర్ ఘాట్ ‘చైతన్య భూమి’ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ సుజాతా సౌనిక్, డీజీపీ రశ్మీ శుక్లా, ముంబై పోలీస్ కమిషనర్ దేవన్ భార్తీ హాజరయ్యారు.
సుప్రీంకోర్టు, రాష్ట్రపతి మధ్య ప్రస్తుతం సంఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థల అధికారాలు, పరిమితులపై తీవ్ర చర్చ కొనసాగుతున్నది. ఇలాంటి సమయంలోనే మహారాష్ట్రలో కార్యనిర్వాహక వ్యవస్థ సైతం వివాదంలో తలదూర్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు శాసన సభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించకపోవడంపై గత నెలలో సుప్రీకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ర్టాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ మూడు నెలల్లోగా ఆమోదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్టికల్ 142 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పింది. వెనక్కి పంపితే కారణాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్ష చేసి రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు ఎలా గడువు నిర్దేశిస్త్తాయో తెలపాలని సుప్రీంకోర్టుని కోరారు. ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్నదో లేదో తెలపాలని సీజేఐకి లేఖ రాశారు.