భోపాల్: కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారి కోసం ఓపెన్ జైళ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో లాక్డౌన్ విధించడం లేదా మార్కెట్లను మూసివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాతో గురువారం అన్నారు. అయితే ముఖానికి మాస్క్‌లు ధరించకపోతే విధిస్తున్న పెనాల్టీ మొత్తం పెంపు, అలాగే బహిరంగ జైళ్లను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లను ఉల్లంఘించిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రూ.200 జరిమానా విధిస్తున్నది. అలాగే ప్రజలు మాస్క్‌లు ధరించేలా, కరోనా నియమాలు అనుసరించేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రోకో టోకో’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నది.
కాగా, ఒమిక్రాన్ వ్యాప్తితోపాటు కరోనా థర్డ్ వేవ్‌పై ఆందోళనల నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినం చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించకపోతే విధించే జరిమానా పెంపుతోపాటు, ఓపెన్ జైళ్ల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నది.