త్రిసూర్, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి పదవి కావాలంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి రూ.500 కోట్లు చెల్లించాలంటూ పంజాబ్‌లో కాంగ్రెస్ నేత, ప్రముఖ క్రికెటర్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్దూ చేసిన ఆరోపణలను మరువక ముందే కేరళలోని త్రిసూర్ కార్పొరేషన్లో మేయర్ ఎంపిక తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించగా, పార్టీ సీనియర్ నేతలకు సంచులకొద్దీ డబ్బులు ఇచ్చి నిజీ జస్టిన్ మేయర్‌గా ఎన్నికయ్యారని.. నాలుగుసార్లు కౌన్సిలర్‌గా చేసిన సీనియర్ నాయకురాలు లాలీ జేమ్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నిజీ జస్టిన్ను మేయర్‌గా ఎన్నిక చేసిన క్రమంలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీనియర్ నేతలు డబ్బుకు అమ్ముడుపోయి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీకి డబ్బు కావాలి. పార్టీ డబ్బు కోసం ప్రయత్నిస్తున్నదని నేను అనుకుంటున్నాను.
నేను కష్టపడి పనిచేస్తానే తప్ప.. నా దగ్గర సొమ్ములు లేవు. ఆమె (నిజీ) కుటుంబం సంపన్నమైది. నేను కేవలం పార్టీకి సేవ మాత్రమే చేయగలను. నాయకులు డబ్బుల సంచులతో నడుస్తున్నారని పలువురు నాకు చెప్పారు. అయితే ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు. భారీగా నోట్ల కట్టలు ఇస్తేనే ఈ పోస్ట్‌ను పొందవచ్చునని కొందరు చెప్పారు. అయితే నా దగ్గర డబ్బు లేదు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను’ అని ఆమె పేర్కొన్నారు. పార్టీ తనపై ఏదైనా క్రమశిక్షణ చర్యకు పాల్పడితే కాంగ్రెస్ నేతల బండారాన్ని మరింత బయటపెడతానని ఆమె హెచ్చరించారు. పార్టీకి సంబంధించిన బోలెడు రహస్యాలు తనకు తెలుసునని అన్నారు. మేయర్ అభ్యర్థి ఎన్నికకు దేనిని ప్రాతిపాదికగా తీసుకున్నారో, తెర వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసునని అన్నారు. కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు తాను కృషి చేసినట్టు ఆమె తెలిపారు. కాగా, ఆమె ఆరోపణలను త్రిసూర్ డీసీసీ అధ్యక్షుడు జోసఫ్ తాజెట్ ఖండించారు.