న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. మోదీ ఇంటిపేరు (Modi surname) వ్యవహారంలో అనర్హతకు గురైన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి (Standing committee on defence) నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు లోక్‌సభ (Lok Sabha) బులెటిన్ విడుదల చేసింది. కాగా, పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడటానికి ముందు కూడా అదే కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా కమిటీకి నామినేట్ అయ్యారు.
ఇక రాహూల్ లానే అనర్హత వేటుకు గురై.. గత మార్చిలో సభ్యత్వం పునరుద్ధరణ పొందిన ఎన్సీపీ (NCP) ఎపీ ఫైజల్ పీ మొహమ్మద్ (Faizal P P Mohammed) కూడా పార్లమెంటరీ కమిటీలో స్థానం పొందారు. ఆయనను వాణిజ్య వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ కమిటీలో సభ్యుడిగా నియమించారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పంజాబ్‌లోని జలంధర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుడు సుశీల్ కుమార్ రింకూ (Sushil Kumar Rinku) వ్యవసాయం, పశుపోషణ, ఆహార ప్రాసెసింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు.
మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019 పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించన విషయం తెలిసింది. దీంతో ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్ ఈ ఏడాది మార్చి 24న అనర్హత వేటువేసింది. అయితే సూరత్ కోర్టు విధించిన శిక్షపై ఈ నెల ఆరంభంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆగస్టు 7న లోక్‌సభ స్పీకర్ ఆయన సభ్యత్వం పునరుద్ధరించారు.