తిరువనంతపురం: పురుషులు తమ హక్కులను కాపాడుకునేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోష్ పీ కున్నపిళ్లే(Eldhose Kunnappilly) డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలతో పురుషులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేస్తున్నారని, అలాంటి కేసుల్ని ఎదుర్కొనేందుకు పురుషుల హక్కుల కమిషన్ కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెంబర్స్ బిల్లును కేరళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఎర్నాకుళంలోని పెరంబవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఎల్దోష్ కున్నపిళ్లేపై గతంలో లైంగిక ఆరోపణలు కేసులు ఉన్నాయి. అయితే పురుషుల కమిషన్‌కు చెందిన ముసాయిదా బిల్లు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తన కేసును డిఫెండ్ చేసుకోవడం ఇలా చేయడం లేదని, ఓ పబ్లిక్ వర్కర్‌గా తన కేసును ఎదుర్కొనే మానసిక ధైర్యం తనకు ఉన్నదని, కానీ అనేక మంది మగవాళ్లు తప్పుడు కేసుల వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
చాలా మంది పురుషులపై లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని, తప్పుడు ఆరోపణల వల్ల వాళ్లు వత్తిడికి లోనవుతున్నారని, కొందరు డబ్బులు చెల్లించి ఆ కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, కొందరైతే ఏమీ చేయలేక పరారీ అవుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే మహిళా కమిషన్ తరహాలోనే పురుషులు తమ హక్కులను కాపాడుకునేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని, మగవాళ్లు ఆ కమిషన్ వద్దకు వెళ్లి తమ ఫిర్యాదులు నమోదు చేసుకునే రీతిలో ఉండాలన్నారు.
మహిళలను అబలలుగా భావించడం వల్ల వాళ్లకు కొన్ని హక్కులు, ప్రివిలేజీలు కల్పించారని, కానీ ఆ రక్షణాత్మక హక్కులను వాడుకుని మగవాళ్లను ఆడవాళ్లు ట్రాప్ చేస్తున్నారని, ఆ తర్వాత వేధింపులకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యే ఎల్దోష్ తనపై మూడు సార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఓ మహిళ కేరళ పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదు చేసింది. పదేళ్ల పాటు ఆ ఎమ్మెల్యే, మహిళ మధ్య పరిచయం ఉందని, కానీ ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ సారి ఎమ్మెల్యే, ఆ మహిళ బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆ ఇద్దర్నీ ఆపేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. తనను రేప్ చేసినట్లు ఆ మహిళ ఆరోపించడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో ఎమ్మెల్యే ఎల్దోష్ ఆ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు.