భోపాల్: న్యూఇయర్ వేడుక సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తన వద్ద ఉన్న గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోట్మా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి ఎక్కి డ్యాన్స్ చేసిన ఆయన తన జేబు నుంచి రివాల్వర్‌ను బయటకు తీశారు. అనంతరం డ్యాన్స్ చేస్తూ గన్ను ఎక్కుపెట్టి గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్పై ఇటీవల కూడా ఒక కేసు నమోదైంది. భర్త, పిల్లలతో కలిసి రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన మహిళను మద్యం మత్తులో ఉన్న ఆయన, మరో ఎమ్మెల్యేతో కలిసి లైంగికంగా వేధించాడు. దీంతో ఆ మహిళ భర్త ట్విట్టర్ ద్వారా పోలీసుల సహాయం కోరాడు. రైల్వే పోలీసులు ఆ మహిళకు సహాయం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.