(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్నది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొన్నాడని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తుండగా.. రాజస్థాన్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు రూ.40 కోట్ల మేర డీల్ చేసుకొన్నారని ఆ పార్టీకే చెందిన మహిళా నేత ఒకరు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మాలవీయనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్టును మహిళా నేత, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అర్చానా శర్మ ఆశిస్తున్నారు.
ఆమె తాజాగా మాట్లాడుతూ తనకు టికెట్టు దక్కకుండా చేయడం ద్వారా బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కొంత మంది సొంత పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఓడిపోతాడని సర్వేలో తేలినా.. రాజీవ్ అరోడాకు టికెట్టు ఇప్పించడం ద్వారా పరోక్షంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలనేది వారి ప్లాన్లో భాగమని ఆరోపించారు. ఈ మేరకు ఓ హోటల్లో రూ.40 కోట్ల ఒప్పందం కుదిరిందన్నారు. ఈ డీల్ ఎవరెవరి మధ్య జరిగిందో తన వద్ద సమాచారం ఉందన్నారు. అయితే అర్చానా శర్మ తన ప్రసంగంలో ఎవరి పేర్లు ప్రస్తావించలేదు.