ఇండోర్, మే 11: ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని, బీజేపీలో చేరిన అక్షయ్ బామ్కు గట్టి షాక్ తగిలింది. 17 ఏండ్ల క్రితం నాటి ఓ హత్యాయత్నం కేసులో అక్షయ్తోపాటు అయన తండ్రిపై స్థానిక సెషన్స్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
వాళ్లిద్దరిని అరెస్టు చేసి, జూలై 8లోగా కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిజిత్ సింగ్ మాట్లాడుతూ అక్షయ్, ఆయన తండ్రి శుక్రవారం కోర్టు ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్నదన్నారు. అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వాళ్ల తరపున న్యాయవాది కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే ఈ అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించి అరెస్టు వారెంట్ జారీ చేసిందని తెలిపారు.