AI | న్యూఢిల్లీ: మానవుడి నిత్య జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ) భాగం కాబోతున్నది. తదుపరి తరం ఏఐని అందుబాటులోకి తెచ్చేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కొందరు ఇప్పటికే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏఐ హెల్పర్లను అందుబాటులోకి తెస్తున్నారు. చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ కంపెనీ గత నెలలో ఆపరేటర్ అనే ఏఐ ఏజెంట్‌ను పరిచయం చేసింది. ఇది వెబ్‌ను ఉపయోగించుకుని ఫారాలను నింపడం, వంట వండటానికి అవసరమైన సరుకులను ఆర్డర్ ఇవ్వడం వంటి పనులు చేస్తుందని ఆ కంపెనీ తెలిపింది.
ఇక ఈ పరుగు పందెంలోకి గూగుల్ కూడా ప్రవేశించింది. ఏఐ కో-సైంటిస్ట్‌ను గూగుల్ బుధవారం ప్రకటించింది. అదే విధంగా సేల్స్‌ఫోర్స్ నిరుడు ఏజెంట్ఫోర్స్ను పరిచయం చేసింది. వెంటనే మైక్రోసాఫ్ట్ స్పందించి, ఏఐ ఏజెంట్ల నిర్మాణం కోసం కోపైలట్ స్టూడియో సిద్ధమవుతున్నదని తెలిపింది. మల్టీమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి ఇటీవలి సంవత్సరాల్లో ఓపెన్ ఏఐతోపాటు గూగుల్, మెటా వంటి టెక్ జెయింట్లు, ఆంత్రోపిక్, స్టెబిలిటీ ఏఐ వంటి లీడింగ్ ఏఐ స్టార్టప్స్ పోటీ పడుతున్నాయి. బొమ్మలు, వీడియోల రూపంలో ఔట్‌పుట్‌ను జనరేట్ చేయడం కోసం కృషి చేస్తున్నాయి. డెవలపర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను ఏఐ పవర్డ్ టూల్స్‌కు అనుసంధానం చేయడంపై దృష్టి సారించారు.