న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి ఈ వేరియంట్ కరోనా సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఐదుగురి ఒమిక్రాన్ రోగుల లక్షణాలను వైద్యులు పరిశీలించారు. ఢిల్లీలోని ఒమిక్రాన్ రోగికి గొంతు నొప్పి, బలహీనత, శరీర నొప్పి ఉన్నదని ఎల్ఎన్జేపీకి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తికి ప్రధానమైన లక్షణాలు లేవని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు.
మరోవైపు భారత్లో మొదటి ఓమిక్రాన్ కేసు అయిన దక్షిణాఫ్రికా జాతీయుడు ఇప్పటికే దేశం విడిచి వెళ్లాడు. కాగా, ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేనట్లు పరిశీలించిన వైద్యులు తెలిపారు. ఇక అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని రెండో ఒమిక్రాన్ రోగి అయిన బెంగళూరు వైద్యుడిలో జ్వరం, ఒంటి నొప్పి వంటి తేలికపాటి లక్షణాలను కనుగొన్నారు. మూడో రోగి ముంబై మెరైన్ ఇంజనీర్, నాలుగో రోగి అయిన గుజరాత్ ఎన్ఆర్ఐకు కూడా తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
కాగా, డెల్టా వేరియంట్ మాదిరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన గుర్తింపు కోల్పోవడం వంటి ప్రధాన లక్షణాలు ఒమిక్రాన్ వేరియంట్ రోగుల్లో లేవని వైద్యులు తెలిపారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ బారి నుంచి కోలుకోవడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పెద్ద ముప్పు ఉండబోదని అంచనా వేస్తున్నారు. సుమారు 200 ఒమిక్రాన్ కేసులు నమోదైన దక్షిణాఫ్రికాతోపాటు ఈ వేరియంట్ వ్యాపించిన 40 వరకు దేశాల్లో ఇప్పటి వరకు దీని వల్ల ప్రాణ నష్టం సంభవించలేదని గణాంకాల ద్వారా తెలిసిందన్నారు.