Crackers seize | బిహార్లో పన్ను చెల్లించకుండానే పలువురు డీలర్లు టపాసులు అమ్ముతున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. రాజధాని నగరం పట్నాతోపాటు పలు ప్రాంతాల్లో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.6 కోట్ల విలువైన పటాకులు స్వాధీనపరుచుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ కమిషనర్ ప్రతిమ హెచ్చరించారు.
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో టపాసుల విక్రయాలు జరుపుతున్నట్లు బిహార్ వాణిజ్యపన్నుల శాఖ అధికారులు గుర్తించారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని 13 చోట్ల పటాకుల డీలర్ల దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరంతా సరైన పత్రాలు లేకుండా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద పన్ను చెల్లించకుండానే అమ్మకాలు సాగిస్తున్నట్లు తేల్చారు. దాడుల సమయంలో రూ.2 కోట్ల విలువైన క్రాకర్లను డీలర్లు రహస్యంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.5 కోట్ల విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
రాజధాని నగరం పట్నాలోని రెండు గోదాముల్లో పెద్ద ఎత్తున టపాసులను దాచినట్లు అధికారులు దాడుల సందర్భంగా గుర్తించారు. ఈ క్రాకర్స్ విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నిల్వలను దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతిమ తెలిపారు. పండగ వరకు ఇలాంటి తనిఖీలు ఇంకా చేపడతామని ఆమె వెల్లడించారు.