Colour Changing Glasses | చెన్నై: రంగులు మార్చే అద్దాలు ఉంటే బాగుంటుందని మీకు అన్పించిందా? మీ ఊహను నిజం చేస్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(సీయూటీఎన్) పరిశోధకులు. మెటీరియల్ సైన్స్ విభాగ సహ ఆచార్యుడు శ్రీనివాసన్ సంపత్, పరిశోధక విద్యార్థిని పీవీ నవ్య కృషితో రంగులు మారే సరికొత్త అద్దాలను కనుగొన్నారు. ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్ రంగాల్లో ఈ రంగు మార్చే అద్దాలు విస్తృతంగా వాడవచ్చు.
ఈ అద్దాలకు విద్యుత్తును అనుసంధానిస్తే నారింజ, పసుపు, పచ్చ, నీలం, ఊదా తదితర రంగుల్లోకి మారతాయి. మనకు కావల్సిన రంగుల్లోకి ఈ అద్దాలను మార్చుకోవచ్చు. అతి నీలలోహిత, పరారుణ కిరణాల నుంచి కూడా ఈ అద్దాలు రక్షణ కల్పిస్తాయి. దీనిపై నేరుగా కాంతి పడినా, ఎదురుగా ఉన్న వస్తువులను చూడవచ్చు. వీటికి కొంత ఎక్కువే ఖర్చవుతుందని పరిశోధకులు తెలిపారు.