భోపాల్ : అయోధ్య రాముడి ఆలయం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ గుడిలో విరాళాల అక్రమాలపై విచారణ జరుగుతున్న టైమ్‌లోనే మరో ఆలయంలో విరాళాల గోల్మాల్ తెరమీదికొచ్చింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాలో ఉండే మా బగళాముఖి ఆలయంలో విరాళాల అక్రమాలు కలకలం రేపుతున్నాయి. ఈ గుడిలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఉండగానే.. ప్రైవేట్ కమిటీ విరాళాలు వసూలు చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా రసీదులు ఇచ్చి విరాళాలు దండుకుంటున్నారనే నేపథ్యంలో కలెక్టర్ ప్రీతి యాదవ్ జూలై 7న త్రిసభ్య కమిటీ వేశారు.
ఈ ఆలయంలో 2024 నుంచి సదరు ప్రైవేట్ కమిటీ విరాళాలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నియమించిన కమిటీకి సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ వ్యక్తులు సొంత రసీదులతో డబ్బు, బంగారం, వెండి కానుకలను తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వీళ్లు ఇచ్చే రసీదులపై ప్రైవేట్ బ్యాంకు నెంబర్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.