Cockroach Janta Party | భారతదేశ సోషల్ మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్న డిజిటల్ విప్లవం నడుస్తోంది. కేవలం ఒక కామెంట్ వలన ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) అనే రాజకీయ ఉద్యమం, కేవలం నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్, బీజేపీ వంటి దేశంలోని అతిపెద్ద అధికారిక రాజకీయ పార్టీల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి సుమారు 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, కాంగ్రెస్‌కి 13.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ రెండింటిని దాటేసి 13.6 మిలియన్ ఫాలోవర్లతో దూసుకుపోతోంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ.
ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, ఉద్యోగాలు లేక సమాజంలో సరైన స్థానం దొరకని కొందరు యువకులు సోమరిపోతులుగా, బొద్దింకలుగా, సమాజ పరాన్నజీవులుగా మారిపోతున్నారని, వారంతా జర్నలిస్టులు, ఆర్టీఐ కార్యకర్తలు, సోషల్ మీడియా ముసుగులో వ్యవస్థలపై దాడులు చేస్తున్నారంటూ కామెంట్లు చేశాడు. అయితే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, అవినితీ, రుపాయి పతనం, ఇంధన ధరలు, పేపర్ లీకేజీల సమస్యలతో ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇక వ్యవస్థ తమను బొద్దింకలుగా చూస్తే, ఆ బొద్దింకలన్నీ ఏకమైతే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజీత్ దిప్కే అనే వ్యక్తి ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపించాడు. దీంతో ఈ పార్టీని స్థాపించి సోషల్ మీడియాలో జాయిన్ అయితే కొద్ది గంటల్లోనే ఈ పార్టీకి విపరీతమైన మద్దతు లభించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలలో ఈ పార్టీకి దూసుకుపోతుంది.
మరోవైపు ఇది కేవలం ఫన్ కోసం పెట్టిన పార్టీలా కనిపిస్తున్నా, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువత నిరసనను తెలియజేయడానికి 5 ముఖ్యమైన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదని, పార్టీలు మారే ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలం పాటు ఎన్నికల నిషేధం విధించాలని, తాము కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తామని, పార్లమెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది.
View this profile on Instagram