Karnataka | బెంగళూరు, అక్టోబర్ 29: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముఖ్యమంత్రి పదవిపై కుర్చీలాట మొదలయ్యింది. ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసేలా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన వర్గీయులు, ఒక్కలిగ సామాజకవర్గ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వచ్చే నెల 13న జరగనున్న చెన్నపట్న అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.
కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన చెన్నపట్న నియోజకవర్గం డీకే శివకుమార్ సొంత జిల్లా అయిన రామనగరలో ఉంది. 2009 నుంచి కాంగ్రెస్ ఇక్కడ ఒక్కసారీ గెలవలేదు. జేడీఎస్‌కు, దేవెగౌడ కుటుంబానికి ఇది పట్టున్న ప్రాంతం. ఉప ఎన్నికలో జేడీఎస్ తరపున, బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారింది. ఐదుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన సీపీ యోగేశ్వరను కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే సీఎం పదవికి చేరువ కావొచ్చని డీకే శివకుమార్ భావిస్తున్నారు. అందుకే ‘నేను అభ్యర్థిని అనుకొని ఓటు వేయండి’ అంటూ ఆయన చెన్నపట్న ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
డీకే వర్గీయులు కూడా చెన్నపట్నలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ‘ఈ ఎన్నిక డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేలా చేస్తుంది. ఉప ఎన్నిక ఫలితం డీకే శివకుమార్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.’ అంటూ డీకే వర్గీయుడు, ఎమ్మెల్యే శివలింగె గౌడ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే డీకేను సీఎం చేయాలని హైకమాండ్‌పై ఆయన వర్గీయులు ఒత్తిడి పెంచనున్నారు. ఇప్పటికే ముడా స్కామ్‌తో సతమతమవుతున్న సీఎం సిద్ధరామయ్యకు ఈ ఉప ఎన్నిక మరో తలనొప్పిగా మారింది.