కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మృతదేహాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ విమర్శించారు. అందుకే బీర్భూమ్ ప్రాంతంలో జరిగిన హింసలో మరణించిన 8 మంది మృతుల కుటుంబాలకు డబ్బులు ఇస్తామని, ఉద్యోగం కల్పిస్తామని ఆమె అంటున్నారని మండిపడ్డారు. హింసకు దారి తీసిన అసలు కారణాలను ప్రభుత్వం పరిశీలించకపోతే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుయని అన్నారు. సీఎం మమతా బెనర్జీ శాంతిభద్రతల పరిస్థితిని నియంత్రించలేకపోయారని ఆయన విమర్శించారు.
కాగా, బీర్భూమ్లో జరిగిన హింస వంటి ఘోరం గత 10-20 ఏండ్లలో జరుగలేదని సుకాంత మజుందార్ తెలిపారు. ఈ హత్యలు మధ్య యుగాల అనాగరికతను పోలి ఉన్నాయని విమర్శించారు. ప్రజలను లాక్కెళ్లి సజీవ దహనం చేశారని ఆరోపించారు. సీఎం మమతా బెనర్జీ ఇక్కడకు ముందే వచ్చి ఉండాల్సిందని అన్నారు. బాధిత కుటుంబాలను గురువారం ఆమె సందర్శించిన నేపథ్యంలో బెంగాల్ బీజేపీ చీఫ్ ఈ మేరకు మండిపడ్డారు. బీర్భూమ్ హింసపై సీబీఐ, ఎన్ఐఏ ద్వారా నిష్పక్షపాత విచారణను తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.