మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 15:53:52

బురారీలో 450 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ప్రారంభం

బురారీలో 450 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి ప్రారంభం

ఢిల్లీ : ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నిర్మించిన 450 ప‌డ‌క‌ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని ఆ రాష్ర్ట‌ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ నేడు ప్రారంభించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆస్ప‌త్రిని ప్రారంభించిన అనంత‌రం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఢిల్లీ ఆరోగ్య‌రంగంలోకి నేడు మ‌రో ప్ర‌పంచ‌స్థాయి ఆస్ప‌త్రి వ‌చ్చి చేరింద‌న్నారు. స‌రైన స‌మయంలో ఆస్ప‌త్రి ప్రారంభించ‌బ‌డింద‌న్నారు. గత నెలతో పోల్చితే దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య ఈ నెల‌లో గణనీయంగా తగ్గిందన్నారు.

జూన్ 23న ఢిల్లీలో అత్యధికంగా ఒకే రోజు 3,947 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. పరీక్షల సంఖ్య పెరిగిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఈ సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. గ‌త నెలలో పాజిటివ్‌ కేసులు, మరణాల రేటు త‌గ్గింది. రికవరీ రేటు పెరిగింది. ఇది ప్రతి ఒక్కరి కృషి వల్లనే సాధ్య‌మైందని కేజ్రీవాల్ అన్నారు. వైద్యులు, నర్సులు, పారామెడిక్ సిబ్బందికి తాను ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌న్నారు. శుక్ర‌వారం నాడు ఢిల్లీలో 1,025 కొత్త కరోనా వైరస్ కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్‌-19 కార‌ణంగా 32 మంది మ‌ర‌ణించారు.


logo