Kishtwar Cloudburst | జమ్మూ కశ్మీర్లో కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తడంతో ఇప్పటి జలవిలయానికి 46 మంది మృతి చెందారు. 167 మందిని రక్షించారు. ప్రస్తుతం మచైల్ మాత యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే మార్గంలో వాహనాలు ప్రయాణించడానికి వీలున్న చివరి గ్రామాల్లో చోసోటి ఒకటి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ, ఎస్ఎస్పీ నరేశ్ సింగ్ నేతృత్వంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలు రంగంలోకి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దోడా-కిష్త్వార్-రాంబన్ (DKR) రేంజ్ డీఐజీ శ్రీధర్ పాటిల్ మాట్లాడుతూ తమ దృష్టి అంతా ప్రస్తుతం సహాయక చర్యలపైనే ఉందన్నారు.
దాదాపు 39 మంది గాయపడిని వారిని తరలించారని.. అందరి పరిస్థితి నిలకడగా ఉందని.. నలుగురిని జమ్మూకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కొండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పూంచ్‌లోని జలాశయాలకు వరద పోటెత్తుతున్నది. వర్షపు నీరంతా రోడ్లపై ప్రవహిస్తున్నది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన క్లౌడ్ బరస్ట్‌పై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్, రాంబన్‌లో గతంలో జరిగిన సంఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. వైమానిక దళ హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రక్షించి, సహాయక చర్యలను వేగవంతం చేస్తాయని ఫరూఖ్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో సహాయ సిబ్బంది సేవలను అభినందించారు.
కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మతో మాట్లాడానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నందున.. పరిపాలన వెంటనే చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేసి.. అవసరమైన రక్షణ, వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు ఎల్జీ మనోజ్ సిన్హా సంతాపం ప్రకటించిన ఆయన.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పోలీసు, సైన్యం, ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎప్ అధికారులను సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. బాధితులకు సాధ్యమైనంత వరకు సహాయం అందించాలని కోరారు. ఈ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లాతో హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. క్లిష్ట పరిస్థితులను, సహాయక చర్యల వివరాలను ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఆలస్యంగా అందుతోందని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సహాయక చర్యల కోసం సమీకరిస్తున్నామని అన్నారు.