లక్నో: ఒక విద్యార్థిని ఆమె ఫ్రెండ్ హుక్కా బార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కొంత మంది వ్యక్తులు ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత పలు హోటల్స్‌కు తీసుకెళ్లి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (student gangraped) బాధితురాలి ఫిర్యాదుతో 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ దారుణం జరిగింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్పోర్ట్స్‌లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేస్తున్నది. రన్నింగ్ కోసం రోజూ కాలేజీలోని గ్రౌండ్‌కు వెళ్తున్నది.
కాగా, మార్చి 29న రన్నింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్లిన ఆ యువతిని స్నేహితుడు కలిశాడు. పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్‌కు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ మరి కొందరు వీరిని కలిశారు. ఈ సందర్భంగా కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించారు. సిగ్రా ప్రాంతంలోని పలు హోటళ్లకు తీసుకెళ్లి వారం రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు తమ కుమార్తె కనిపించడం లేదని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అదే రోజున పోలీసులు గుర్తించి కుటుంబానికి అప్పగించారు. అయితే ఏప్రిల్ 6న లాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఆ యువతి ఫిర్యాదు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు 23 మంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. నిందితుల్లో కొందరు మాజీ క్లాస్మేట్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అని పేర్కొంది.
కాగా, యువతి ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. 23 మంది నిందితుల్లో 11 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ విద్యార్థిని మైనర్ బాలిక కాదని స్పష్టం చేశారు.