న్యూఢిల్లీ: ఒక వ్యంగ్య వ్యాఖ్య నుంచి ఆవిర్భవించి.. కొద్దికాలానికే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడిప్పుడే దేశ వ్యాప్తంగా పలు సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్న సీజేపీలో చీలిక ఏర్పడింది. ఆ పార్టీకి చెందిన మనీశ్ బ్రహ్మభట్ అందులోంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తమ సంస్థకు కాక్రోచ్ జనతా పార్టీ-డెమోక్రాటిక్ (సీజేపీ-డెమోక్రాటిక్)గా నామకరణం చేశారు. అసలైన కాక్రోచ్ ఉద్యమం ‘అమ్ముడుపోయింది-రాజకీయీకరణ’ చెందింది అని ఆయన ఆరోపించారు. సీజేపీ ఉద్యమం కారణంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడంతో దక్కిన విజయం తర్వాత సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే, ఇతరులు 12 మంది సభ్యులతో ఒక గ్రూపుగా ఏర్పడ్డారన్నారు. అయితే వారు నిరసనకారులతో, ప్రజలతో, వలంటీర్లతో ఎలాంటి సంప్రదింపులు జరుపడం లేదని పేర్కొన్నారు. సీజేపీ జాతీయ బృందంలో 8 మంది ఆప్ సభ్యులని, సీజేపీ ఒక పేపర్ మాఫియాగా మారుతున్నదని ఆరోపించారు. సీజేపీ మొత్తం అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లో పనిచేస్తున్నదని ఆరోపించారు.