నటిగా వామికా గబ్బీది 19ఏండ్ల ప్రయాణం. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ భాషల్లో కలిపి దాదాపుగా ఓ ముప్ఫై సినిమాల్లో నటించింది. కానీ గుర్తింపు మాత్రం అరాకొరే. అయితే.. ‘డీసీ’ సినిమా ఆమె తలరాతను మార్చింది. రాత్రికి రాత్రి తనను స్టార్‌ని చేసింది. ఆ సినిమాలో వామిక పోషించిన ‘చంద్ర’ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్రనే వేసిందని చెప్పాలి. దీంతో ఈ చండీఘడ్ సుందరికి అవకాశాలు వరుస కడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం అగ్ర కథానాయకుడు సూర్యకు జోడీగా ఈ ముద్దుగుమ్మ నటించనున్నట్టు వినికిడి. సూర్య ప్రస్తుతం జితు మాధవన్ దర్శకత్వంలో 47వ సినిమా చేస్తున్నారు. ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో 48వ సినిమా ఉంటుంది. తర్వాత హెచ్.వినోద్ డైరెక్షన్లో 49వ సినిమా చేస్తారు సూర్య. ఆ సినిమాలోనే వామిక గబ్బీ కథానాయికగా ఖరారైనట్టు తెలిసింది. ఈ వార్త నిజమైతే.. వామికా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే.