ముంబై: దేశంలో పౌరుల స్వేచ్ఛకు న్యాయస్థానాలే రక్షకులని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. అందువల్లే ప్రజలు న్యాయస్థానాలపై నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. సీజేఐ ముంబైలో శనివారం వైబీ చవాన్ సెంటర్లో అశోక్ హెచ్ దేశాయ్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. బార్ అసోసియేషన్ సభ్యులు నిర్భయంగా పనిచేస్తే భవిష్యత్తులో స్వేచ్ఛా వెలుగులు ఇప్పటి కంటే ఉజ్వలంగా ప్రకాశిస్తాయని పేర్కొన్నారు. పౌరుల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు ఎంత కీలకమైనదో తెలిపేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పే నిదర్శనమని గుర్తుచేశారు. యూపీకి చెందిన ఇక్రం అనే వ్యక్తికి విద్యుత్తు పరికరాల తస్కరణ కేసులో ట్రయల్‌కోర్టు విధించిన శిక్షలో చోటుచేసుకొన్న పొరపాటు వల్ల అతడు ఏకంగా 12 ఏండ్లు జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. అతడిపై ఉన్న ప్రధాన కేసులో ఓ ట్రయల్‌కోర్టు రెండేండ్ల శిక్ష విధించింది. మరో 8 చిన్న కేసుల్లో ఏడాది, రెండేండ్ల చొప్పున శిక్షలు వేసింది. ఆ అన్ని శిక్షలను చట్టప్రకారం ఏకకాలంలో అమలుచేయాలి. కానీ, ట్రయల్ కోర్టు జడ్జి పొరపాటున ‘ఏకకాలంలో’ అనకుండా ‘ఒకటి తర్వాత ఒకటి’ అని తీర్పు చెప్పటంతో ఇక్రం 18 ఏండ్లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ తీర్పు ఆక్షేపించి సుప్రీంకోర్టు అతడిని విడుదల చేసింది అని సీజేఐ చెప్పారు.