CJI Chandrachud | న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను మన్నించమని కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈ వ్యవస్థలో అత్యధికంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న వ్యక్తిని, న్యాయమూర్తిని నేను’ అని ఆయన అన్నారు. ‘అవసరంలో ఉన్న వారికి సేవ చేయలిగే స్థితిలో ఉండటం కంటే గొప్ప అనుభూతి ఉండదు. జస్టిస్ సంజీవ్ ఖన్నా లాంటి దృఢమైన, గౌరవప్రదమైన, అంకితభావం కలిగిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు తీసుకుంటున్నందున నేను కోర్టును వీడుతున్నా ఎలాంటి తేడా ఉండబోదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన రికార్డును ఎవరూ చెరిపేయలేరు: జస్టిస్ సంజీవ్ ఖన్నా
సుప్రీంకోర్టును మరింత మెరుగుపర్చాలనే లక్ష్యంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ పని చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఆయన 38 రాజ్యాంగ ధర్మాసన తీర్పులు ఇచ్చారని ఈ రికార్డును ఎవరూ అధిగమించలేరని పేర్కొన్నారు.
పదవీకాలంలో కీలక తీర్పులు
జస్టిస్ చంద్రచూడ్ 2022 నవంబర్ 8న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, జైల్ మాన్యువళ్లలో కులవివక్షను రద్దు చేయడం, స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను నిరాకరించడం వంటి కీలక తీర్పులు ఆయన నేతృత్వంలోని ధర్మాసనాలు ఇచ్చారు. కళ్లకు గంతలు తొలగించి, చేతిలో ఖడ్గం బదులు రాజ్యాంగంతో న్యాయదేవతకు కొత్త రూపాన్ని ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించారు.