న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు వచ్చే ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) గురించి సమాచారం తెలుసుకునే హక్కు పౌరులకు లేదని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం ఆ హక్కు లేదని అటార్నీ వెంకటరమణి వెల్లడించారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను సుప్రీం ముందు కేంద్రం సమర్థించుకున్నది. ఆంక్షలు లేకుండా ఎటువంటి విషయాన్ని తెలుసుకోలేమని అటార్నీ తన స్టేట్మెంట్లో సుప్రీంకు తెలిపారు. ఒకవేళ ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం పొలిటికల్ ఫండింగ్ గురించి తెలుసుకునే వీలు లేకుంటే అప్పుడు ఆర్టికల్ 19(2) ప్రస్తావన ఉండదని అటార్నీ తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఆర్టికల్ 19(2) పరిధిలోకి వస్తుందని ఏజీ వెంటకరమణి చెప్పారు. రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాలపై పారదర్శకత ఉండాలని వేసిన పిటీషన్ల గురించి సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నది. ఆ పిటీషన్లకు కౌంటర్‌గా కేంద్రం తన వాదన వినిపించింది. విరాళాలు వస్తున్న వ్యక్తులు, ఆ అభ్యర్థుల నేర చరిత్రను పోల్చడం కరెక్టు కాదు అని అటార్నీ చెప్పారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపడుతోంది. రేపు సుప్రీంలో ఈ కేసుపై వాదనలు జరగనున్నాయి.