చండీగఢ్: మండి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను చెంప దెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను అరెస్ట్ చేసినట్టు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మరోవైపు నిందితురాలికి ఎస్కేఎం(రాజకీయేతర) తదితర రైతు సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి.
ఎస్కేఎం నాయకుడు జగ్జీత్ సింగ్ మాట్లాడుతూ తన పర్స్, మొబైల్ ఫోన్ తనిఖీ జరుగుతున్నప్పుడు కంగన కుల్విందర్తో వాదనకు దిగిందన్న వార్తలు వచ్చాయని.. ఇదే నిజమైతే అందుకు కుల్విందర్‌ను బాధ్యురాలిని చేయడం తగదన్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్నదన్న కంగన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తనను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు సీఐఎస్ఎఫ్ వెల్లడించగానే కుల్విందర్ కౌర్ ఎక్స్‌లో స్పందించారు. ‘ఈ ఉద్యోగం పోతుందనే భయం నాకు లేదు. నా తల్లి గౌరవం కోసం ఇలాంటి ఉద్యోగాలు వెయ్యి అయినా వదులుకోవడానికి నేను సిద్ధం’ అని ఆమె వ్యాఖ్యానించారు.