బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పను సీఐడీ సోమవారం మూడు గంటలపాటు ప్రశ్నించింది. 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోక్సో, ఇతర సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. సీఐడీ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఫిబ్రవరి 2న బాధితురాలిని యెడియూరప్ప తన నివాసంలో లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు నమోదయ్యాయని చెప్పారు. మార్చి 14న నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సమన్లు జారీ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తిరస్కరించారు. తనపై కుట్రలకు పాల్పడేవారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఆయనను అరెస్టు చేయరాదని కర్ణాటక హైకోర్టు శుక్రవారం చెప్పింది. ఇదిలావుండగా, బాధిత బాలిక తల్లి అనారోగ్యంతో గత నెలలో మృతి చెందారు.